మెటా తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో యువ వినియోగదారుల రక్షణ కోసం ఒక ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్‌లలో అందుబాటులో ఉండే 'మెటా ఏఐ' చాట్‌బాట్‌తో టీనేజర్లు ఆత్మహత్య లేదా స్వీయ-హానికి సంబంధించిన విషయాలను చర్చిస్తే, ఆ విషయాన్ని వెంటనే వారి తల్లిదండ్రులకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావం పట్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో మెటా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ సరికొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్‌స్టాగ్రామ్ ‘పేరెంటల్ సూపర్‌విజన్ టూల్స్’ ఉపయోగించే తల్లిదండ్రులకు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్‌ను భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ విస్తరించనున్నట్లు మెటా ప్రకటించింది. టీనేజర్లు చాట్‌బాట్‌తో జరిపే సంభాషణల్లో ఆత్మహత్య లేదా స్వీయ-హాని గురించిన స్పష్టమైన లేదా పరోక్ష సంకేతాలను గుర్తించడానికి మెటా ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యవస్థను రూపొందించింది. పిల్లల ఉద్దేశం పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, అనుమానాస్పదంగా అనిపిస్తే ఈ ఏఐ వ్యవస్థ తల్లిదండ్రులకు అలర్ట్ పంపుతుంది. అయితే, తల్లిదండ్రులు పిల్లల పూర్తి వ్యక్తిగత సంభాషణను చదవలేరు, కానీ గత వారంలో తమ పిల్లలు మెటా ఏఐతో ఏయే విస్తృత అంశాలపై చర్చించారో తెలుసుకునే వీలుంటుంది. ఇప్పటికే టీనేజర్లతో లైంగిక, శృంగారభరిత లేదా మద్యం సంబంధిత సున్నితమైన అంశాలపై మెటా ఏఐ మాట్లాడకుండా ఆంక్షలు ఉన్నాయి. వీటికి అదనంగా, ఒకవేళ వినియోగదారుడు చాట్‌బాట్ సంభాషణల ద్వారా తక్షణ ఆత్మహత్య ప్రమాదంలో ఉన్నట్లు గుర్తిస్తే, నేరుగా స్థానిక అత్యవసర సేవల విభాగాలకు సమాచారం అందించే మరో శక్తివంతమైన ఫీచర్‌ను కూడా మెటా అభివృద్ధి చేస్తోంది. గతంలో ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో ఆత్మహత్య కంటెంట్ పెట్టినప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లకు కూడా వర్తింపజేస్తున్నారు.
0 Comments