దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ప్రధాని మోడీ శుక్రవారం హర్యానాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యాలోని జింద్, సోనిపట్ మధ్య (89 కి.మీ) నడవనుంది. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి రైల్వే వ్యవస్థలో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడం దేశ గర్వకారణమని వెల్లడించారు. అధునాతన రైల్వే ఇంజినీరింగ్‌లో దేశ సామర్థ్యాలకు ఇది నిదర్శమని కొనియాడారు. ఇదిబొగ్గు, డీజిల్ అవసరం లేకుండా కేవలం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. ఇది రైలును ముందుకు నడపటానికి హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. దీనివల్ల రైలు నడుస్తున్నప్పుడు కార్బన్ ఉద్గారాలు సున్నాగా ఉంటాయి. పర్యావరణహితంగా 'నమో గ్రీన్‌రైలు' పేరుతో నడిచే ఈ రైలుకు 10 కోచ్‌లు, 3200 హెచ్‌పీ ఇంజిన్ ఉన్నాయి. ఈ రైలు సుమారు గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో దాదాపు 2600 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది. దీంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలో అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది.
0 Comments