Ad Code

నెట్‌ఫ్లిక్స్ లో టీవీ తరహా ఛానళ్లను ప్రవేశపెట్టే అవకాశం ?

నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సిద్దమవుతుంది. ముఖ్యంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత "ఏ సినిమా చూడాలి? ఏ వెబ్‌సిరీస్ చూడాలి ?? అనే సందిగ్ధంలో పడే వారి కోసం పరిష్కారం తీసుకు రాబోతుంది. టీవీ తరహా ఛానళ్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఏ సినిమా లేదా సిరీస్ చూడాలన్నా వినియోగదారుడే ఎంపిక చేసుకోవాలి. అయితే కొత్త విధానంలో యాప్‌లోనే నిరంతరం ప్రసారమయ్యే ప్రత్యేక ఛానళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి కేబుల్ లేదా శాటిలైట్ టెలివిజన్‌లా కాకుండా పూర్తిగా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయని.. ముందే సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు లేదా ఇతర కంటెంట్ వరుసగా ప్రసారం అవుతాయని సమాచారం. అయితే ఈ కొత్త విధానం ఇంట్లో పనులు చేసుకుంటూ, వీకెండ్‌లో రిలాక్స్ అవుతూ లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ప్లే చేయాలనుకునే వారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. యాక్షన్ సినిమాలు, కామెడీ చిత్రాలు, క్రైమ్ థ్రిల్లర్లు, రొమాంటిక్ మూవీస్, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, క్లాసిక్ సినిమాలు లేదా ప్రముఖ వెబ్‌సిరీస్‌ల ప్రసారాలు వంటి విభాగాల వారీగా ఛానళ్లను రూపొందించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కొత్త కంటెంట్‌ను కనుగొనడం కూడా వినియోగదారులకు మరింత సులభమవుతుంది. మరోవైపు ఇతర ఓటీటీ సేవలతో కలిసి బండిల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తీసుకురావాలనే ఆలోచనపైనా నెట్‌ఫ్లిక్స్ పరిశీలన కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకే సబ్‌స్క్రిప్షన్ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ స్ట్రీమింగ్ సేవలను తక్కువ ధరలో అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరప్ వంటి మార్కెట్లలో ఇప్పటికే ఇలాంటి బండిల్ ప్యాకేజీలు మంచి ఆదరణ పొందుతున్నాయి. దీంతో వినియోగదారులు విడివిడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాన్‌లో అనేక సేవలను పొందే అవకాశం ఉంటుంది. భారత్‌లో కూడా ఈ తరహా మోడల్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu