సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసే వారిపై, కుటుంబాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు, నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ నియమించాలని చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో రాష్ట్ర డీజీపీ సోషల్ మీడియా అక్రమాలు, కుట్రలపై ఒక సమగ్రమైన ప్రత్యేక నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు. ఇటీవల అరెస్ట్ అయిన జోసఫ్ రావణ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు, వ్యవస్థీకృత గ్రూపులు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న తీరును నివేదికలో డిజిటల్ ఆధారాలతో సహా పొందుపరిచారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అత్యంత వ్యూహాత్మకంగా విద్వేషాన్ని నూరిపోస్తున్నారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. డిజిటల్ వేదికలపై నిరంతరం సమాజాన్ని కలుషితం చేసే ఇటువంటి అరాచక శక్తులకు చట్టం పవర్ చూపించాల్సిందేనని మంత్రులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియా నేరగాళ్లపై నమోదవుతున్న కేసులను కోర్టుల్లో బలంగా వాదించడానికి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడానికి అవసరమైతే ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తూ, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించేలా న్యాయపరమైన మౌలిక వసతులను బలోపేతం చేయాలని ఐటీ, హోంశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
0 Comments