ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. కారు పలాస సమీపంలో ప్రమాదానికి గురైన వేళ.. అందులో ప్రయాణిస్తున్న పల్నాడు జిల్లా ఈవూరు మండలం ఇనుమెళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు, మీరావళితో పాటు మరొక గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటు విశాఖ ఆనందపురం వద్ద లారీని ఢీకొట్టిన కారు బాధితులు, అటు పలాస వద్ద ప్రమాదానికి గురైన కారు బాధితులు ఇద్దరూ పల్నాడు జిల్లాకు చెందిన వారే కావడం, ఇరు కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోనే జరగబోయే వేర్వేరు శుభకార్యాలకు వస్తుండటం గమనార్హం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారులోని మరో ప్రయాణికుడు చంద్రశేఖర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, హైవే సిబ్బంది సహాయంతో చంద్రశేఖర్‌ను రక్షించి చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అతివేగమా లేదా డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘోరానికి కారణమా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments