Ad Code

విశాఖ కాగ్నిజెంట్ మెగా క్యాంపస్‌కు సెజ్ హోదా

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఐటీ హబ్‌గా రూపాంతరం చెందే ప్రయాణంలో మరో భారీ మైలురాయి నమోదైంది. నగరంలోని మధురవాడ పరిధిలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న సరికొత్త క్యాంపస్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి హోదాను అధికారికంగా మంజూరు చేసింది. విదేశాలకు ఐటీ సేవలను ఎగుమతి చేసే లక్ష్యంతో కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ మెగా ప్రాజెక్టుకు పన్ను మినహాయింపులు, ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. ప్రభుత్వం మధురవాడ పరిధిలో కాగ్నిజెంట్ సంస్థకు 22.19 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో దాదాపు 8.9 ఎకరాల విస్తీర్ణాన్ని ఎస్‌ఈజెడ్ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థలంలో సంస్థ నిర్మించనున్న అత్యాధునిక క్యాంపస్ ఏకంగా 1.48 మిలియన్ చదరపు అడుగుల బిల్టప్ ఏరియా తో పర్యావరణ అనుకూల గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల చొరవతో ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయింది. ఈ మెగా క్యాంపస్ నిర్మాణం కోసం కాగ్నిజెంట్ సంస్థ ఏకంగా రూ. 1,583 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో ఈ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది లోనే దీని మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ పనులు పూర్తి చేసుకుని 2029 ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుండగా, 2033 నాటికి పూర్తిస్థాయిలో మూడు ఫేజ్‌ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యేలోపు.. తాత్కాలికంగా మధురవాడలోని మహతి టెక్నాలజీ భవనం నుంచి కాగ్నిజెంట్ తన తాత్కాలిక కార్యకలాపాలను కూడా ఇప్పటికే ప్రారంభించింది.

Post a Comment

0 Comments

Close Menu