Ad Code

మానసిక సమస్యలతో బాధపడుతున్న మాజీ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చెరువులో దూకి ఆత్మహత్య

హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో శనివారం తెల్లవారుజామున మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మాజీ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నగ్నంగా రోడ్లపై పరుగెత్తి, చివరకు స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన తేజస్వినిగా గుర్తించారు. ఆమె గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేదని, ఆరు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి పీర్జాదిగూడలోని శంకర్ నగర్ కాలనీలో తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటోందని తెలిపారు. శుక్రవారం రాత్రి ఇల్లు మారే విషయమై తల్లితో కలిసి మియాపూర్‌లో ఇళ్లు వెతికి వచ్చిన తేజస్విని, శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తల్లి పడుకున్న గదికి బయటి నుంచి లాక్ చేసింది. ఆ తర్వాత ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తింది. దారిలో ఉన్న బీరప్ప గుడి వద్ద ఆగి నమస్కారం చేసుకుని, ఆపై పీర్జాదిగూడ చెరువులోకి దూకినట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా తెలిసింది. ఉదయం తల్లి నిద్రలేచి చూసేసరికి గది బయట లాక్ చేసి ఉండటంతో పొరుగువారి సహాయంతో తలుపులు తీయించింది. కూతురు కనిపించకపోవడంతో వెతకగా, చెరువులో తేజస్విని మృతదేహం లభ్యమైంది. హైడ్రా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తేజస్విని కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని, తరచూ భయంకరమైన కలలు వస్తున్నాయని చెబుతుండేదని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu