గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంకు త్వరలో మహర్దశ పట్టనుంది. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఎయిర్ పోర్టును కూడా అంతే స్దాయిలో అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేశీయ, అంతర్ విమాన సర్వీసుల విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం వంటి అంశాలపై ఇవాళ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం చర్చించింది. అనంతరం ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ కోచైర్మెన్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందన్నారు. విజయవాడ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్‌ను దసరా నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం కొచ్చిన్‌కు నేరుగా విమాన సర్వీస్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు మరిన్ని విమాన సర్వీసులు అవసరమని కమిటీ అభిప్రాయపడిందని తెలిపారు. విజయవాడ నుంచి దుబాయ్‌కు, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైతే అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని కేశినేని వెల్లడించారు. అలాగే విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్‌కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కమిటీ కోరింది.
0 Comments