Ad Code

‘మీ మార్ట్’ షాపు ప్రారంభం : పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో లాలుపురంలో పైలట్ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మీ మార్ట్’ షాపును రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ ఆశయాలను, రాబోయే ప్రణాళికలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత మేలు చేసేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సుమారు 29,750 రేషన్ దుకాణాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మళ్లీ నాణ్యమైన సరుకులను అందించేందుకు అన్ని రకాల చర్యలు వేగంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సరికొత్త విధానంలో భాగంగా గుంటూరు రూరల్ పరిధిలోని లాలుపురంలో పైలట్ ప్రాజెక్టుగా మొదటి ‘మీ మార్ట్’ దుకాణాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజలకు అవసరమయ్యే దాదాపు 50 రకాల నాణ్యమైన వస్తువులతో ఈ షాపును అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో ఈ సరుకుల సంఖ్యను మరింత పెంచి, దాదాపు 250 రకాల నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు మీ మార్ట్ లలో లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లాలుపురం అనుభవాలు, ప్రజల నుంచి వచ్చే స్పందనను ఆధారంగా చేసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,000 ‘మీ మార్ట్’ దుకాణాలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన సరుకులు నేరుగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రేషన్ వ్యవస్థను కేవలం బియ్యం పంపిణీకే పరిమితం చేయకుండా, మినీ సూపర్ బజార్లుగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. సాధారణ ఓపెన్ మార్కెట్‌లో లభించే ధరలతో పోలిస్తే, ఈ ‘మీ మార్ట్’ దుకాణాల్లో ప్రతి వస్తువుపై ఐదు రూపాయల వరకు తక్కువ ధరకే లభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన నిత్యావసరాలను తక్కువ ధరలకే అందించడం ద్వారా సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu