పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన చంద్రబాబు

ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్ నోవాతో పాటు డాక్టర్లను ఆయన ఆరోగ్యంపై ఆరా తీసారు. పవన్ కళ్యాణ్ తోనూ చంద్రబాబు మాట్లాడి ఆయన ఆరోగ్యంపై వాకబు చేసారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఆయన ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తుంటారని, అలాగే ప్రజలను విశేషంగా ఆకర్షించే శక్తి ఆయనకు ఉందని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఆయన తన గురించి తాను మర్చిపోతుంటారన్నారు. పవన్ కు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన బాగా కోలుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని నమ్మకం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఆరు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి, తదుపరి కార్యాచరణపై వారు సూచనలు చేస్తారని చంద్రబాబు మీడియాకు తెలిపారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై, మెరుగైన చికిత్సపై చంద్రబాబు ఆస్పత్రి వర్గాలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ ను చంద్రబాబు పరామర్శించిన సమయంలో ఆయనతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org