ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో అత్యంత విస్తుగొలిపే ఒక కిరాతక క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటూ, పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన ఒక స్కూల్ యజమానురాలు, కేవలం తన కామవాంఛ కోసం కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న అతుల్ పన్వర్, దామిని దంపతుల జీవితంలోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశించడంతో ఈ దారుణ ఉదంతం జరిగింది. ఒక వైపు భార్యగా నటిస్తూనే, మరోవైపు భర్త ప్రాణాలు తీసేందుకు ఆమె వేసిన స్కెచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతుల్ పన్వర్ నడుపుతున్న పాఠశాలలోనే బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి అక్రమ సంబందానికి భర్త అతుల్ అడ్డుగా ఉన్నాడని దామిని భావించింది. అతడిని శాశ్వతంగా ఈ లోకం నుంచి సాగనంపితేనే తామిద్దరం స్వేచ్ఛగా ఉండొచ్చని ప్రియుడు తుషార్తో కలిసి ఆమె హత్యాకాండకు ప్రణాళిక రచించింది. సహజ మరణంగా లేదా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు విషసర్పం అస్త్రాన్ని ఎంచుకున్నారు. తుషార్ తన స్నేహితులైన సోను, ఉదయ్ ల సహాయంతో నాగుపామును సంపాదించి రహస్యంగా దామినికి చేరవేశాడు. పథకం ప్రకారం ఒక రాత్రి దామిని తన భర్త అతుల్ కు ఆహారంలో భారీగా మత్తుమందు కలిపి ఇచ్చింది. అతుల్ స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాక బెడ్రూమ్ లోకి ప్రవేశించి ఆ విషసర్పాన్ని నేరుగా భర్త పడుకున్న మంచంపై వదిలేసింది. ఆ పాము అతుల్ ను కాటు వేయడంతో, మత్తులోనే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భర్త మరణించాక ఏమీ తెలియనట్లు దామిని హైడ్రామా మొదలుపెట్టింది. గదిలోకి పాము ఎలాగో వచ్చి కరిచిందని, తన భర్త చనిపోయాడంటూ బంధువుల ముందు కన్నీరుమున్నీరైంది. అయితే, ఆధునిక ఇళ్లలోకి, అదీ బెడ్రూమ్ మంచం పైకి అంత పెద్ద విషసర్పం అంత సులువుగా ఎలా రాగలదనే సందేహం పోలీసులకు వచ్చింది. పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో మృతుడి శరీరంలో విషంతో పాటు మత్తుమందు ఆనవాళ్లు కూడా బయటపడటంతో పోలీసుల అనుమానం బలపడింది. రంగంలోకి దిగిన మీరట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దామిని కాల్ డేటాను, ఆ రోజు రాత్రి ఆమె కదలికలను నిశితంగా పరిశీలించగా డ్రైవర్ తుషార్ తో ఉన్న కనెక్షన్ బయటపడింది.
0 Comments