ఆంధ్రప్రదేశ్ లోని కురుపాం మేజర్ గ్రామ పంచాయతీకి ప్రతిష్ఠాత్మక ఐఎస్‌వో ధ్రువీకరణ లభించింది. రాష్ట్రంలోని ఎంపికైన 23 గ్రామ పంచాయతీల జాబితాలో కురుపాం మేజర్ పంచాయతీ చోటు దక్కించుకోగా, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎంపికైన ఏకైక పంచాయతీగా నిలిచింది. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా కురుపాం మేజర్ గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) ఎ. వెంకటనాయుడు ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కురుపాం ఎంపీడీఓ జె. ఉమామహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీఓ జి. రమేష్‌బాబు మాట్లాడుతూ, మన్యం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో కురుపాం మేజర్ పంచాయతీకి మాత్రమే ఈ గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. పంచాయతీ ఈఓ వెంకటనాయుడు, సిబ్బంది సమిష్టి కృషి, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే నిబద్ధత వల్లే ఈ అరుదైన ఘనత సాధ్యమైందని అభినందించారు. ఐఎస్‌వో ధ్రువీకరణతో కురుపాం మేజర్ పంచాయతీ సేవల నాణ్యత, పరిపాలనా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని మరోసారి నిరూపితమైందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, పారదర్శక పాలనను కొనసాగించి పంచాయతీకి మరిన్ని గుర్తింపులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ గుర్తింపు కురుపాం మండల ప్రజలకు గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments