Ad Code

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా దళాలు : ప్రతిగా కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్'ని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఇరాన్‌లోని సుమారు 140 వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సైతం అంతే తీవ్రంగా స్పందించి బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో గల్ఫ్ రీజియన్ మొత్తం హైఅలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్) యాక్టివేట్ చేశాయి. కువైట్ వైమానిక పరిధిలోకి వచ్చిన శత్రు దేశ డ్రోన్లను తమ దళాలు అడ్డుకున్నాయని కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్‌లోని అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆయుధ డిపోలపై దాడులు చేశామని ఇరాన్ క్లెయిమ్ చేసింది. మరోవైపు, తమ దేశంపైకి దూసుకొచ్చిన క్షిపణి ముప్పును సమర్థవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. అమెరికా నావికాదళానికి చెందిన 'ఫిఫ్త్ ఫ్లీట్' ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్‌లో అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగాయి. బహ్రెయిన్‌లోని అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇక ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరమైన 'అల్ ఉదైద్ ఎయిర్ బేస్' పైనా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అక్కడ ఉన్న ఫైటర్ జెట్ మెయింటెనెన్స్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. దీంతో ఖతార్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. అలాగే, జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌ను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ఫైటర్ జెట్లు, డ్రోన్లు, నౌకల ద్వారా క్షిపణి లాంచ్‌ సైట్లు, నిఘా కేంద్రాలు, ఆయుధ డిపోలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. దీనిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఎక్స్ (ట్విట్టర్) లో స్పందిస్తూ.. "ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తోంది" అని హెచ్చరించారు. దీనికి కౌంటర్‌గా.. అమెరికా ఏకపక్ష ఒప్పందాల కాలం ముగిసిందని, తమపై దాడులు కొనసాగిస్తే మరింత విధ్వంసకర రీతిలో బుద్ధి చెబుతామని ఇరాన్ టాప్ నెగోషియేటర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' లో ఇరాన్ దళాలు 'సైప్రస్' కు చెందిన ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో అది అగ్నిప్రమాదానికి గురైంది. అనంతరం ఈ మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయడంతో అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ ఆయిల్ సప్లైపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గల్ఫ్ దేశాలన్నీ ప్రస్తుతం యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu