తిరుమలలో భక్తులకు సదుపాయాల పెంపు పై టీటీడీ ఫోకస్ చేసింది. కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా తిరుమలలో లాంజ్ నిర్మాణం దిశగా కసరత్తు జరుగుతోంది. పూర్తి స్థాయి సదుపాయాలతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. టీటీడీ భక్తుల కోసం మరో కీలక నిర్ణయం పైన తుది కసరత్తు చేస్తోంది. శ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం తిరుమలలో లాంజ్ నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవాణి భక్తులు వేచి ఉండేందుకు ఎయిర్‌పోర్టుల్లో ఉన్నట్లు లాంజ్ నిర్మించనుంది. అన్నమయ్య భవనానికి సమీపంలోని న్యూ ఉడ్‌సైడ్ హోటల్ ప్రాంగణాన్ని లాంజ్‌లా తీర్చిదిద్దనుంది. భక్తులు వేచి ఉండేందుకు విమానాశ్రయాల తరహాలో లాంజ్ నిర్మించాలని టీటీడీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఈ ఉడ్‌సైడ్ భవనంలో భక్తుల కోసం విశ్రాంతి గదులు, ఫర్నిచర్, స్నానాల గదులు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫుడ్‌కోర్ట్ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా భక్తులకు ప్రయోజన కరంగా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లు మూడు నెలల ముందు 500 ఆన్ లైన్ లో ప్రతీ రోజు 500 కరెంట్ బుకింగ్, మరో 300 గతంలో విరాళాలిచ్చి టికెట్లు పొందని వారి కోసం కేటాయిస్తున్నారు. మరో 200 టికెట్లు రోజూ తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు. ఈ టికెట్లు పొందిన భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. కరెంట్ బుకింగ్ లో టికెట్లు పొందిన వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు టీటీడీ దర్శనం కల్పిస్తోంది. ఉదయం 9 గంటలకు టికెట్లు తీసుకున్న భక్తులు సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. వారికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. విమానాశ్రయం తరహాలో శ్రీవాణి భక్తులు వేచి ఉండేందుకు లాంజ్ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు. వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
0 Comments