దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద రీ డెవలప్‌మెంట్ చేసిన మొత్తం 75 రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17న ఒకేసారి వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేస్తారు. ఈ స్టేషన్లు పూర్తిగా హైటెక్ సదుపాయాలతో ఏయిర్ పోర్టు లుక్ లో తీర్చి దిద్దారు. హైదరాబాద్ లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ను మొత్తం రూ.26 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ హైటెక్‌సిటీతో పాటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఐడీ కారిడార్‌కు దగ్గరగా ఉంది. దీంతో ప్రతి రోజూ వేలాదిమంది ఉద్యోగులు, ప్రయాణికు లు ఈ స్టేషన్ నుంచి రాకపోకల కొనసాగిస్తుండటంతో కీలకంగా మారింది. ప్రతి రోజూ ఏకంగా 62 ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి వెళుతుంటాయి. ఇప్పటికే స్టేషన్‌లో ఉన్న రెండు లిఫ్టులకు అదనంగా మరో రెండు లిఫ్టులు, ప్రధాన ప్రవేశద్వారం అభివృద్ధి, కొత్త ఓవర్ బ్రిడ్జి, వెయిటింగ్‌హాల్, కొత్తగా టాయిలెట్లు, కొత్త స్టేషన్ భవనం నిర్మించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైనా ఆధునిక సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా జంట నగరాలతో పాటుగా తెలంగాణలోని మరి కొన్ని స్టేషన్లలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అమరావతికి సింహద్వారంగా భావించే మంగళగిరి నియోజకవర్గంలో మరో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పూర్తయింది. దాదాపు రూ. 12.56 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యాధునిక హంగులతో పునర్నిర్మించిన మంగళగిరి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని కలిగించేలా రీ-డెవలప్మెంట్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. రూ. 12.56 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆధునికీకరణలో భాగంగా స్టేషన్ ముఖద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక బుకింగ్ కౌంటర్లు, కొత్త ప్లాట్ ఫారాలు, ఎస్కలే టర్లు, లిఫ్ట్ సదుపాయాలతో పాటు డిజిటల్ డిస్ ప్లే బోర్డులు, స్టేషన్ పరిసరాలలో ఆకట్టుకునేలా పచ్చదనంతో కూడిన సుందరీకరణ పనులు చేపట్టారు. అదే విధంగా విజయవాడ శివారు లోని రాయనపాడు స్టేషన్ ను తీర్చి దిద్దారు. వీటిని ప్రధాని వర్చ్యువల్ గా ప్రారంభించి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
0 Comments