Ad Code

రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్ మెస్‌లో ఫుడ్‌ పాయిజన్ : 30 మంది దంత వైద్య విద్యార్థినులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్ మెస్‌లో తిన్న ఆహారం వికటించి దాదాపు 30 మంది దంత వైద్య విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి హాస్టల్ వసతి గృహంలో కొందరు విద్యార్థినులు దోశ, చట్నీ తిన్నారు. అయితే, ఆ ఆహారం తిన్న విద్యార్థినులంతా బుధవారం తెల్లవారుజాము నుంచి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మొదట తెల్లవారుజామున 10 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో బాధపడగా, ఉదయానికి ఆ సంఖ్య మరింత పెరిగి మరో 20 మంది విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ అలర్ట్‌ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులందరినీ తక్షణమే కడప రిమ్స్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యుల బృందం విద్యార్థినులకు అత్యవసర వైద్య సేవలను అందిస్తోంది. విద్యార్థినుల అస్వస్థత ఘటనపై రిమ్స్ అధికారులు స్పందిస్తూ ఆసుపత్రిలో చేరిన విద్యార్థినులలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu