Ad Code

హైదరాబాద్‌లో ఎబోలా లక్షణాలతో సూడాన్‌ దేశస్తుడు : గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరిక


హైదరాబాద్‌, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఎబోలా లక్షణాలతో సూడాన్‌ దేశస్తుడు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరాడు. శాంపిల్స్‌ సేకరించిన అధికారులు పుణే ల్యాబ్‌కు పంపించారు. టెస్ట్‌ రిజల్ట్‌ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని.. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్‌ నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే నిబంధనలను జారీ చేసింది. ఇటీవలే ఎబోలా వైరస్‌ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu