Ad Code

ఫారో దీవుల్లో 'గ్రైండాడ్రాప్‌' ఉత్సవం : 700 కుపైగా తిమింగళాలు, డాల్ఫిన్‌ల ఊచకోత !


నార్త్‌ అట్లాంటిక్‌ సముద్రంలోని ఫారో దీవుల్లో అక్కడి సంప్రదాయమైన 'గ్రైండాడ్రాప్‌' ఉత్సవంలో భాగంగా ఏకంగా ఒక్క రోజులో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను ఊచకోత కోశారు. దాంతో సముద్ర తీరం ఎర్రగా మారిపోయింది. మే 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ సముద్ర పర్యావరణ సంస్థ 'సీ షెఫర్డ్‌' ప్రకారం టోర్షావన్‌లో సాండెగెర్డి బే వద్ద వేటగాళ్లు 402 పైలట్ తిమింగలాలను, నాలుగు బాటిల్‌నోస్‌ డాల్ఫిన్‌లను ఒడ్డుకు తీసుకొచ్చి వాటి శరీరాలని చీల్చారు. అదేవిధంగా స్కాలబోట్నూర్‌లో 168 వైట్‌ సైడెడ్‌ డాల్ఫిన్‌లు, హాల్విక్‌లో 132 వైట్‌ సైడెడ్‌ డాల్ఫిన్‌లను చంపేశారు. వాటిని చంపేందుకు ఉపయోగించే ఆయుధాల కొరత ఏర్పడటంతో కొక్కేలు, కత్తులు ఉపయోగించి వాటి శరీరాలను చీల్చేశారు. దాంతో అవి ఒడ్డున విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి. ఈ వధను చిన్నారులు సహా అనేకమంది సముద్రపు ఒడ్డున ఉండి చూడటం గమనార్హం. సీ షెఫర్డ్‌లోని ఫారో దీవుల డైరెక్టర్‌ వాలెంటీనా క్రాస్ట్‌ దీన్ని తీవ్రంగా ఖండించారు. అమాయక జంతువులను ఇంత క్రూరంగా బాధించి చంపడాన్ని సమర్థించలేమన్నారు. ఈ సంప్రదాయాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కాగా ఈ సామూహిక వధ అనేది వెయ్యి ఏళ్ల నాటి సంప్రదాయంగా అక్కడి వారు చెబుతున్నారు. అయితే జంతు ప్రేమికులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆధునిక కాలంలో ఇది అనాగరికమైన చర్య అని, కాలం చెల్లిన పద్ధతిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వెంటనే దీన్ని ఆపేయాలంటూ ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సామూహిక వధకి ముందురోజు ఫారోస్‌ పార్లమెంటులో వేటాడే డాల్ఫిన్‌ల కోసం ఉన్న సంక్షేమ చట్టాన్ని సవరించడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu