సౌర వ్యవస్థలో సంభవించిన ఒక శక్తిమంతమైన విస్ఫోటనం భూమి దిశగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో తీవ్రమైన జియోమాగ్నెటిక్ తుఫాను భూమిని తాకే అవకాశం ఉంది. దీనిపై నాసా దృష్టి పెట్టింది. ఎటువంటి విపత్తు సంభవిస్తుందనే విషయంపై ఆరా తీస్తోంది. ఈ పరిణామాల వల్ల భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన 'అరోరా బొరియాలిస్' కాంతులు కనిపించే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి లఢక్ గగనతలంపై ఈ నార్తర్న్ లైట్స్ కనిపించవచ్చు. ఈ నెల 6న సూర్యుడిపై సంభవించిన భారీ పేలుడు కారణంగా సౌర తుఫాన్ ఏర్పడింది. దీనికి జీ3 (అతి తీవ్ర సౌర తుఫాన్)గా నాసా ప్రకటించింది. సూర్యుడిపై అత్యంత చురుకైన 'యాక్టివ్ రీజియన్ 4461' నుంచి ఈ భారీ సౌర జ్వాల (M1.8 క్లాస్) చెలరేగింది. అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫిలమెంట్ విస్ఫోటనం సంభవించినట్లు అంతరిక్ష నిపుణులు పేర్కొన్నారు. ఇది సెకనుకు దాదాపు 1,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. నేడు భూఅయస్కాంత క్షేత్రంతో ఢీకొనే అవకాశం ఉంది. సూర్యుడి నుంచి వెలువడిన ఈ పదార్థంలో అతి దట్టమైన, గురుత్వాకర్షణ స్థాయి అత్యధికంగా ఉండే సోలార్ ఫిలమెంట్ ఉందని అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. దీన్ని టెక్స్ట్‌బుక్ కోర్ ఫిలమెంట్ ఎరప్షన్ గా స్పేస్ వెదర్ నిపుణురాలు తమీథా స్కోవ్ అభివర్ణించారు. శాటిలైట్ డేటా ఆధారంగా దీని తీవ్రతను నిర్ధారించారు. ఆకర్షణీయమైన ఈ సౌర ధూళి వల్ల ఏర్పడే అరోరాలు, సాధారణం కంటే దక్షిణ ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం ఉందని ఆమె సూచించారు.
0 Comments