గుజరాత్‌లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిమాట్లాడుతూ దేశం ఇప్పుడు ప్రతికూలతలను దాటి సరికొత్త ఆశలు, అసాధారణ ఆకాంక్షలతో ముందుకు సాగుతోందని, దేశ పౌరులు తమ కలలను, సంకల్పాలను నిజం చేయడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోడీ విమర్శించారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేయగా, డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మధ్య అశాంతిని, అనిశ్చితిని సృష్టిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టారని, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం ప్రజలు ఆ పార్టీ అవినీతి, దుష్పరిపాలన పట్ల తీవ్ర విసుగు చెందారని మండిపడ్డారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లలో మూడింటిని బీజేపీ కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. ఈ ఫలితాలు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సైతం కాంగ్రెస్ తప్పుడు పరిపాలనను పూర్తిగా తిరస్కరించారని నిరూపిస్తున్నాయని ఆయన వివరించారు. హిమాచల్ ప్రదేశ్ కంటే ముందే హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందని, పంజాబ్ ప్రజలు కూడా ఆ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సమాజంలో అశాంతిని సృష్టించి, ఆ గందరగోళం నుండి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే కాంగ్రెస్ పప్పులు ఇకపై ఉడకవని ఆయన హెచ్చరించారు.
0 Comments