Ad Code

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య అవగాహన : చెరో రాజ్యసభ సీటుకు పోటీ

జార్ఖాండ్‌ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ విషయంలో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలకు ఎట్టకేలకు తెరపడింది. చెరో స్థానంలో పోటీ చేసేందుకు రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కాంగ్రెస్ పరిశీలకులు భూపేశ్ బఘేల్, అజయ్ శర్మ ఆదివారంనాడు జరిపిన చర్చల అనంతరం ఇరుపార్టీల మధ్య అవగాహన కుదిరింది. కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు హేమంత్ సోరెన్ అంగీకారం తెలిపారు. రాజ్యసభ సీట్లకు పోటీపై గత రెండ్రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. జేఎంఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గత శుక్రవారంనాడు సమావేశమై రెండు రాజ్యసభ స్థానాలకు జేఎంఎం పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే తుది నిర్ణయం ముఖ్యమంత్రికే అప్పగించినట్టు తెలిపారు. జేఎంఎం నిర్ణయంతో అప్పటికే జార్ఖాండ్‌ నుంచి తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆ పార్టీ పరిశీలకులు భూపేష్ బఘేల్, అజయ్ శర్మ హుటాహుటిన హేమంత్ సోరెన్‌తో శనివారంనాడు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం మరో విడత చర్చల అనంతరం చెరో సీటు పంచుకునేందుకు అవగాహన కుదిరింది.

Post a Comment

0 Comments

Close Menu