కావేరీ నదిపై మేకెదాటు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరి 5న ఇచ్చిన తుది తీర్పును, సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 16న ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, అలాగే సంబంధిత బేసిన్ రాష్ట్రాల అంగీకారం లేదా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందకుండానే, కావేరీ నదిపై మేకెదాటు వద్ద ఆనకట్టను నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఏకపక్ష ప్రయత్నాన్ని సభ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ అనుమతులతో సహా ఎటువంటి అనుమతులనూ మంజూరు చేయవద్దని ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు అసెంబ్లీ కోరింది. కావేరీ బేసిన్ నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న మొత్తం నీటిని ఇప్పటికే బేసిన్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేశారని కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు గుర్తించాయని తీర్మానం పేర్కొంది. కాబట్టి కావేరీ బేసిన్‌లో కొత్త ప్రాజెక్టును చేపట్టడం గానీ, అదనపు నీటిని వినియోగించుకోవడం గానీ సాధ్యం కాదని అందులో స్పష్టంచేశారు. ఇప్పటికే విజయ్ ఈ అంశంపై ప్రధాని మోడీకి సైతం నేరుగా తన వ్యతిరేకత తెలిపారు.
0 Comments