ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను శనివారం విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా... కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
0 Comments