బ్యాంకులు వచ్చే వారం వరుస సెలవుల కారణంగా వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. జూన్ 26వ తేదీ శుక్రవారం నాడు మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉంది. ఆ మరుసటి రోజు జూన్ 27న నాలుగో శనివారం, జూన్ 28న ఆదివారం కావడంతో బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనులు, పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రాలు లేదా డిపాజిట్లు వంటి ముఖ్యమైన లావాదేవీలు ఉన్నవారు జూన్ 25వ తేదీ లోపునే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే మళ్లీ జూన్ 29 వరకు వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సెలవుల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, ఏటీఎం సేవలతో పాటు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యూపీఐ డిజిటల్ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులు తమ సర్వర్ల నిర్వహణ పనులు (మెయింటెనెన్స్) చేపడితే కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వినియోగదారులు అత్యవసర ఖర్చులకు సరిపడా నగదును ముందే దగ్గర ఉంచుకోవడం సురక్షితం.
0 Comments