ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన పాలకమండలి తొలి సమావేశం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ పాల్గొని వివరాలను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా ఉన్న ప్రముఖ నటుడు సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, బుర్రా సాయిమాధవ్, చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, వై. ఝాన్సీ, కందిమల్ల సాంబశివరావు, కె. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ, మరియు దుర్గాప్రసాద్ సాహు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగాల సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సభ్యులు విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్‌ను నియమించే ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. అనంతరం జరిగిన జనరల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపేలా ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ వినోద రంగాన్ని బలోపేతం చేయడం కోసం మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు పరిశ్రమ వృద్ధికి ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం వంటి కీలక అంశాలపై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. తెలుగు సినీ రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నంది అవార్డుల’ అంశంపై ఈ సమావేశంలో ప్రత్యేక చర్చలు జరిగాయి. గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు, భవిష్యత్తులో నిర్వహించబోయే నంది అవార్డుల వేడుకల యొక్క రూపకల్పన, విధానాలు మరియు సిఫార్సులకు సంబంధించిన పలు అంశాలను సభ్యులు సమీక్షించారు. ఏపీలో చిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మరియు నిర్మాతలకు కార్పొరేషన్ ద్వారా పూర్తి మద్దతు అందిస్తామని బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ ముదావత్ శ్రీనివాస్ నాయక్‌తో పాటు కార్పొరేషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments