Ad Code

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం భర్తకు సెలైన్‌ బాటిల్ ద్వారా విషం ఇచ్చి చంపిన భార్య : పట్టిచ్చిన వాట్సాప్ స్టేటస్

ర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని అదే ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్‌ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం, అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్‌ దొంబార్‌ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్‌ కాల్‌ డాటా ఆధారంగా ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ''యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?'' అంటూ అతను పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్‌ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్‌ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్‌ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే శాండీప్‌ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్‌ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్‌వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu