Ad Code

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య : అనారోగ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వైనం !

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో పచ్చని సంసారాన్ని కాదని, సోషల్ మీడియా వ్యామోహంతో ఒక మహిళ తన భర్తను హతమార్చిన ఘటన కలకలం రేపింది. కాకినాడకు చెందిన పుల్లా దుర్గాప్రసాద్ (38) అనే ఆటో డ్రైవర్‌కు గుండె జబ్బు ఉంది. గతంలో అతనికి స్టెంట్ ఆపరేషన్ కూడా జరిగింది. అయితే, అతని భార్య రమాదేవికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాపట్ల జిల్లాకు చెందిన ప్రసాదం గోపీసాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రమాదేవి, ప్రియుడితో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. ఈ జంట దుర్గాప్రసాద్‌కు ఉన్న అనారోగ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. పక్కా ప్లాన్ ప్రకారం, ఈ ఏడాది మార్చి 13న రమాదేవి తన భర్త తాగే జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపింది. అది తాగిన దుర్గాప్రసాద్ స్పృహ కోల్పోగానే, రమాదేవి, గోపీసాయి కలిసి అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా దుర్గాప్రసాద్‌కు మళ్లీ గుండెపోటు వచ్చిందని, దాంతోనే అతడు మరణించాడని బంధువులను, స్థానికులను నమ్మించారు. అతనికి ముందే గుండెజబ్బు చరిత్ర ఉండటంతో కుటుంబ సభ్యులు కూడా అది సహజ మరణమేనని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్య జరిగి నెలలు గడుస్తున్నా ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ, ఇటీవల దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక అనామక సందేశం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. గుండెపోటు మరణం కాదని, అది ముమ్మాటికీ హత్యేనని తేలడంతో భార్య రమాదేవిని, ఆమె ప్రియుడు గోపీసాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu