తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్'లో రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురామ్ రెడ్డితో కలిసి ఖమ్మంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు. నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా వర్గీకరించి గత 25 నుండి 30 రోజులుగా ప్రజల వద్దకే ప్రభుత్వం అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఆఖరి విభాగం పూర్తయిందని, ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల మంది ప్రజలను తాను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను కళ్లారా చూసి, చెవులారా విన్నానని పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి 24వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11వేలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు అందినట్లు వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతోపాటు అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని చెప్పారు. గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చే ముందు సాదాబైనామాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చి ఆ తర్వాత చట్టంలో చేర్చకుండా రైతులను గాలికి వదిలేసిందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9.26లక్షల సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి నిబంధనలను సవరించిందని తెలిపారు. గతంలో భూమి అమ్మిన వారి సమ్మతి కూడా కావాలనే నిబంధన ఉండేదని, కానీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మిన వారి సమ్మతి అవసరం లేకుండా నిబంధనలు మార్చామని చెప్పారు. ఇప్పటికే ఐదున్నర లక్షల దరఖాస్తులను గుర్తించి నోటీసులు ఇచ్చామని, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని, చట్టప్రకారం 30 రోజుల నోటీసు గడువు తర్వాత అర్హులైన అన్ని సాదాబైనామాలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
0 Comments