ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు పంపిణి చేశారు. రైతుల భూములకు నూటికి నూరు శాతం యాజమాన్య హక్కులను కల్పిస్తూ, కరెన్సీ నోట్లకు ఉండే స్థాయి భద్రతా ఫీచర్లు, రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని రైతులకు వివరించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు పచ్చదనంతో అలరారుతూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని ముఖ్యమంత్రి కొనియాడారు. "బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రికార్డుల వల్ల ఏపీలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి. కానీ, గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో రికార్డులను తారుమారు చేసి, ప్రైవేటు సంస్థలకు అప్పగించి గందరగోళం సృష్టించారు. భూమి రైతులదైతే.. పాస్ పుస్తకాలు, పొలం సరిహద్దు రాళ్లపై మాత్రం నాటి పాలకుడి బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజాధనం రూ.800 కోట్లు తగలేసి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు" అని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చేసిన ఈ దుర్మార్గాన్ని సరిదిద్ది, భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి తమ ప్రభుత్వానికి మూడేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులను భాగస్వాములను చేస్తూ, వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాతే తప్పులు లేని పాస్ పుస్తకాలను ముద్రిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి, 26.46 లక్షల మందికి పాస్ పుస్తకాలు అందజేశామని, మిగిలిన 62.32 లక్షల పుస్తకాలను నిర్దేశిత గడువులోగా పంపిణీ చేస్తామని, మొత్తం 90 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.
0 Comments