తమిళనాడు సీఎం విజయ్ వినూత్న పథకం ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకూ ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహుమతిగా అందించేలా ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి విజయ్ పేరు మీదుగా విజయ్ మేనమామ పథకం గా నామకరణం చేశారు. తమిళ సంప్రదాయంలో చెల్లెలికి పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఆభరణాన్ని బహుమతిగా ఇవ్వడం ఒక పవిత్రమైన ఆచారంగా వస్తోంది. ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ.. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకూ తానే ఒక మేనమామ గా ఉండి బంగారు ఉంగరాన్ని కానుకగా ఇస్తానని సీఎం విజయ్ ప్రకటించారు. గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా.. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను భారీగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ విప్లవాత్మక జీవో విడుదలైన వెంటనే అటు ప్రజల నుంచి, ఇటు రాజకీయ వర్గాల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే పేద కుటుంబాలకు ఈ పథకం ఒక పెద్ద ఆర్థిక, సామాజిక భరోసాగా నిలవనుంది. పసిబిడ్డ పాదాలు ఇంట్లో పడకముందే.. ప్రభుత్వం తరఫున లక్ష్మీదేవి లాంటి బంగారం అందే అవకాశం ఉండటంతో తల్లులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పెద్ద జనరల్ హాస్పిటల్స్ వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ పథకం తక్షణమే అమల్లోకి వచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఉచితాలు, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తమిళనాడులో గతంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు ఇచ్చిన మిక్సీలు, గ్రైండర్లు, లాప్‌టాప్‌ల రికార్డులను తిరగరాస్తూ.. విజయ్ తీసుకొచ్చిన ఈ గోల్డ్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఆయనకు తిరుగులేని పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
0 Comments