ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 'తల్లికి వందనం' పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రి లోకేష్ కి వివరించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో 'మెగా పీటీఎం' నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
0 Comments