దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు చాలా స్వల్పంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన మారుతీ సుజుకీ 'వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్' కార్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశీయ ఇంధన వ్యూహాలు, భవిష్యత్తు ఇంధన ప్రణాళికలపై కీలక విషయాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం వెంటాడుతున్నా.. భారత్ ఈ సవాలును ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటోందని కొనియాడారు. ప్రపంచంలోని మొత్తం 193 దేశాల ఇంధన ధరల పెంపులను తాము విశ్లేషించామని.. ఇందులో అత్యంత తక్కువగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచిన దేశాల్లో జపాన్ తర్వాత భారతదేశమే 2వ స్థానంలో నిలిచిందని హర్దీప్ సింగ్ పూరీ లెక్కలతో సహా వెల్లడించారు. అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం ఇంధన భద్రతతో పాటు స్థిరత్వాన్ని కాపాడుకుంటూ వస్తోందని చెప్పారు. భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక ఇంధన విధానాల వల్లే ఈ అరుదైన స్థిరత్వం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. క్రూడ్ సోర్సింగ్ డైవర్సిఫికేషన్.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం వంటి చర్యలు ఇందుకు ఎంతో దోహదపడ్డాయన్నారు. దేశం కేవలం సంప్రదాయ ఇంధనాలపైనే ఆధారపడకుండా, పర్యావరణహిత స్వచ్ఛమైన ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వాడకాన్ని దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ ప్రకారం.. 85 శాతం వరకు ఇథనాల్ కలిపిన 'E85' ఇంధనాన్ని మోనో-ఫ్యూయల్ స్టాండర్డ్‌గా గుర్తించామని, ఇది దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ఇండస్ట్రీకి పెద్ద మార్పులు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోట్లాది వాహనదారులు ఇథనాల్ బ్లెండింగ్ వైపు మారడం అనేది దేశ దీర్ఘకాలిక ఇంధన ప్రణాళికకు ఒక బలమైన పునాదిగా మారి ఇంధన ధరల స్థిరత్వానికి మరింత ఊతమిస్తుందని చెప్పారు.
0 Comments