Ad Code

మహారాష్ట్రలో పెళ్లిపత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ ?

హారాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై ప్రతి పెళ్లి పత్రికపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన ద్వారా వివాహ సమయంలో వధూవరుల వయస్సును సులభంగా నిర్ధారించడానికి, తనిఖీ చేయడానికి వీలవుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే అసెంబ్లీలో వెల్లడించారు. బాల్యవివాహాలకు కేరాఫ్‌గా ఉన్న రాజస్థాన్‌లో ఇటువంటి నిబంధన మంచి ఫలితాలను ఇచ్చిందని, అదే మోడల్‌ను ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ప్రింటింగ్ ప్రెస్‌లు, కళ్యాణ మండపాలు, ఈవెంట్ ఆర్గనైజర్లపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో బాల్యవివాహాల కేసులు పెరుగుతుండటంపై 'మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్' ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వినూత్న ప్రతిపాదనను సిఫార్సు చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికీ 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు జరిపిస్తున్న రేటు అధికంగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా పర్భణీ జిల్లాలో 48% బాల్యవివాహాలు నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బీడ్ (43.7%), ధూలే (40.5%), సోలాపూర్ (40.3%) జిల్లాలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల గతంతో పోలిస్తే ఈ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2019-21లో 21.9% గా ఉన్న బాల్యవివాహాల రేటు, 2023-24 నాటికి 19.6% కి పడిపోయింది. ఇది జాతీయ సగటు (20.1%) కంటే తక్కువ కావడం గమనార్హం. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సుమారు 1,434 బాల్యవివాహాలను విజయవంతంగా అడ్డుకున్నారు. బీడ్, మరాఠ్వాడా వంటి గ్రామీణ ప్రాంతాలలో చెరకు నరకడం కోసం కూలీలు సీజనల్ వలసలు వెళ్లే సమయంలోనే బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళనతో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, వారు వలస వెళ్లే కాలంలో పిల్లల రక్షణ కోసం ప్రత్యేకంగా 'చైల్డ్ కేర్ సెంటర్స్' (శిశు సంరక్షణ కేంద్రాలు) సౌకర్యాలను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బాల్యవివాహాలపై మరింత కఠినమైన నిఘా ఉంచేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ మోడల్‌ను నిశితంగా అధ్యయనం చేస్తోంది. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో 2013 నుంచే పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలతో పాటు, బాల్యవివాహం చట్టరీత్యా నేరమనే హెచ్చరికను ముద్రించడాన్ని తప్పనిసరి చేశారు. ఉదాహరణకు రాజస్థాన్‌లోని బూంది జిల్లాలో రహస్యంగా జరిగే బాల్యవివాహాలను అడ్డుకోవడానికి స్కూల్ ప్రిన్సిపాల్స్, రెవెన్యూ అధికారులు, గ్రామ్ సేవకులు, అంగన్‌వాడీ కార్యకర్తలతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు సమాచారం వస్తే ఈ బృందాలు వెంటనే తహశీల్దార్, పోలీసులకు సమాచారం అందించి వాటిని అడ్డుకుంటాయి. ఇదే తరహా పటిష్టమైన నిఘా వ్యవస్థను మహారాష్ట్రలోనూ త్వరలో అమలు చేయనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu