తమిళనాడు ఉద్యోగుల్లో జవాబుదారీతాన్ని పెంపొందించే దిశగా టీవీకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయం ఉద్యోగుల కోసం బయోమెట్రిక్ అటెండెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేసింది. నేటి నుంచి ఈ వ్యవస్థ అమలులోకి వచ్చింది. మొదటగా సచివాలయంలోని మానవ వనరుల నిర్వహణ విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా మిగిలిన శాఖలు, ఇతర విభాగాధిపతుల కార్యాలయాలకూ విస్తరించనుంది. ఇలాంటి వ్యవస్థ సచివాలయంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ ఉదయం నుంచీ మానవ వనరుల విభాగాధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమయంలో హాజరు కావడం కనిపించింది. బయోమెట్రిక్, ఫేస్ ఐడీ అటెండన్స్ అనంతరం విధులకు హాజరయ్యారు. ఈ నూతన వ్యవస్థ ఉద్యోగులలో పారదర్శకత, జవాబుదారీతనం, సమయపాలనను మెరుగుపరుస్తుందని విభాగం స్పష్టం చేసింది. ఇకపై ఉద్యోగులు ఉదయం 10 గంటల లోపు కార్యాలయానికి చేరుకుని డిజిటల్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు, నూతన ఎలక్ట్రానిక్ వ్యవస్థతో పాటు మాన్యువల్ హాజరు రికార్డులు కొనసాగించాలని మానవ వనరుల విభాగం సర్కులర్ జారీ చేసింది. అలాగే సచివాలయ ప్రాంగణంలో విధుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులందరూ తమ అధికారిక గుర్తింపు కార్డులను తప్పనిసరిగా మెడలో ధరించాలని ఆదేశించింది. ఈ వ్యవస్థను గతంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా, కొన్ని అభ్యంతరాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయోగాత్మక దశ విజయవంతంగా పూర్తి కావడంతో, కార్యాచరణ సమస్యల సమీక్ష అనంతరం హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు ఈ వ్యవస్థను పూర్తిగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో హాజరు, సమయపాలన నిబంధనలను కఠినతరం చేయాలనే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యను తీసుకుంది.
0 Comments