Ad Code

హైదరాబాద్ లో రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ పేవర్‌ బ్లాక్‌లతో ప్లాస్టిక్‌ ఫుట్‌పాత్‌ ఏర్పాటు !

హైదరాబాద్ లోని సోమాజిగూడలో నడకదారులకు పూర్తిగా రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ పేవర్‌ బ్లాక్‌లతో తయారుచేసిన మొదటి ఫుట్‌పాత్‌ అందుబాటులోకి వచ్చింది. ప్లాసిక్‌ పేవర్‌ బ్లాక్‌లను ఉపయోగించి ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. సౌరశక్తితో నడిచే ఫుట్‌పాత్‌ల నిర్మాణ పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని సోమాజిగూడ- నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్‌ స్టేషన్ల మధ్య రెండు కిలోమీటర్ల మేర ప్లాస్టిక్‌ నడక దారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యాభవన్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. పారేసిన ప్లాస్టిక్‌ సంచులు (పాలీ బ్యాగ్‌లు), సీసాలు, సీసాల మూతలు, తినుబండారాల ప్లాస్టిక్‌ ప్యాకెట్లను పేవర్‌ బ్లాక్‌ల తయారీకి వినియోగించారు. పేవర్‌ బ్లాక్‌ల్లో 60-70 శాతం వరకు తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్, అధిక సాంద్రత కలిగిన సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. మిగిలిన భాగంలో కొంత మినరల్‌ మిశ్రమాన్ని వాడినట్లు అధికారులు తెలిపారు. ప్లాసిక్‌ ఫుట్‌పాత్‌లు వాటర్‌ ప్రూఫింగ్‌తో పాటు సుదీర్ఘకాలం నాణ్యతగా, మన్నికగా ఉంటాయని ఇంజినీర్లు తెలిపారు. ఒకవేళ మరమ్మతులు అవసరమైతే సంబంధిత భాగంలో బ్లాక్‌లను విడిగా తీసి మార్చవచ్చని వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu