Ad Code

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త : డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యాపారి

బెంగళూరులో డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యాపారి నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వైశాఖ్ అనే వ్యాపారవేత్త గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఇంటికి కూడా దూరంగా ఉంటున్నాడు. వారం రోజుల నుంచి బెంగళూరు, రాజరాజేశ్వరి నగర్‌లోని నటి క్రిషి తపండ ఇంట్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో క్రిషి ఇంట్లో లేదు. ఆమె యలహంకికి వెళ్లింది. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వైశాఖ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడని వెల్లడైంది. కుటుంబసభ్యులు వైశాఖ్ మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వైశాఖ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డిని బెదిరించిన కేసులో వైశాఖ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఐదు రోజుల పాటు అతడిని విచారించారు. ఫిబ్రవరి 6వ తేదీన కర్ణాటక హైకోర్టు వైశాఖ్ కేసు విచారణపై స్టే విధించింది.

Post a Comment

0 Comments

Close Menu