అమర్‌నాథ్ యాత్ర కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగష్టు 28న ముగియనుంది. ఈ సందర్బంగా యాత్రికులకు, పర్యాటకులకు, అక్కడి సాధారణ ప్రజలకు కూడా స్థానిక అధికారులు ట్రాఫిక్ సహా, ఆరోగ్యం వంటి అంశాల్లో కొన్ని సూచనలు చేశారు. యాత్రికుల రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కొన్ని మార్గాల్లో నిర్దిష్ట సమయం వరకు భక్తులను అనుమతించబోరు. నవయుగ టన్నెల్‌ను మూసేస్తారు. కాశ్మీర్ నుంచి జమ్మూ వచ్చే వాహనాలను ఉదయం 11.30 గంటల వరకు అనుమతించారు. అలాగే, జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్లే వాహనాలను మధ్యాహ్నం 3.00 తర్వాత అనుమతించరు. అలాగే, మరికొన్ని రూట్లలో కూడా నిర్దిష్ట సమయాల్లో ట్రాఫిక్ ఆపేయడం చేస్తారు. బల్తాల్, పహల్గాం మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల భద్రత కోసం వసతి, భద్రత, ఆహారం, వైద్య సదుపాయాల్ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులకు శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్తాన బోర్డు ఇన్సూరెన్స్ కవరేజ్‌ను పెంచింది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం లేదా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులతోపాటు దేవస్థాన సిబ్బంది, అక్కడ పని చేసే కార్మికులు, అధికారులకు ఉచితంగానే వర్తిస్తుంది. యాత్ర మార్గంలో రెండు ప్రత్యేక ఆస్పత్రుల్ని ఏర్పాటు చేశారు. పూర్తి సామగ్రితో ఇవి పని చేస్తాయి. ఇందులో 70 వరకు బెడ్లు, 100 అంబులెన్సులు, 1,000 మంది వరకు సిబ్బంది అందుబాటులో ఉంటాయి. నిర్దిష్ట సమయానికి ముందుగానే భక్తులు కాశ్మీర్ చేరుకోవాలని బోర్డు సూచించింది. ఈ యాత్ర కోసం భారీ స్తాయిలో భద్రతా సిబ్బంది పని చేయనున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలు కూడా భద్రతా సేవల్లో పాల్గొంటాయి.
0 Comments