Ad Code

ఫిఫా ప్రపంచకప్ 2026 : ఖతార్‌ను 6-0 గోల్స్ తేడాతో ఓడించిన కెనడా

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో కెనడా తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ బీలో భాగంగా బీసీ ప్లేస్ స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కెనడా 6-0 గోల్స్ తేడాతో ఖతార్‌ను చిత్తు చేసింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే కెనడాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. స్టార్ స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ అద్భుతమైన హాట్రిక్ గోల్స్‌తో ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే కెనడా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 16వ నిమిషంలో జోనాథన్ డేవిడ్ కొట్టిన వాలీని ఖతార్ కీపర్ అడ్డుకోలేకపోయాడు. అక్కడే ఉన్న సైల్ లారిన్ దానిని గోల్‌గా మలిచి కెనడా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో డేవిడ్ మరో అద్భుతమైన గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. కొద్దిసేపటికే కెనడా ఆటగాడు బుకానన్‌ను ఫౌల్ చేసినందుకు ఖతార్ డిఫెండర్ హొమామ్ ఎల్ అమిన్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి మైదానం వెలుపలికి పంపారు. మొదటి భాగం ముగిసే సమయానికి (45+1వ నిమిషంలో) డేవిడ్ తన రెండో గోల్ చేయడంతో కెనడా 3-0తో బలంగా నిలిచింది. సెకండాఫ్‌లో ఖతార్‌కు మరో గట్టి షాక్ తగిలింది. కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనేపై ప్రమాదకరంగా ట్యాకిల్ చేసినందుకు ఖతార్ ఆటగాడు అసిమ్ మదిబో కూడా రెడ్ కార్డ్‌తో బయటకు వెళ్లాడు. దీంతో ఖతార్ కేవలం 9 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. గాయపడిన కోనే స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన నాథన్ సాలిబా 64వ నిమిషంలో ఫ్రీ-కిక్‌ను అద్భుతమైన గోల్‌గా మార్చాడు. 75వ నిమిషంలో ఖతార్ ఆటగాడు మహ్మద్ అల్ మనై చేసిన సెల్ఫ్ గోల్ కెనడా ఆధిక్యాన్ని 5-0కి చేర్చింది. చివరగా.. ఇంజూరీ టైమ్ (92వ నిమిషం) లో జోనాథన్ డేవిడ్ తన మూడో గోల్ పూర్తి చేసి హాట్రిక్‌తో కెనడాకు 6-0తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. లియోనల్ మెస్సి తర్వాత ఈ టోర్నమెంట్‌లో హాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు.

Post a Comment

0 Comments

Close Menu