అమెరికా విధించిన పది శాతం గ్లోబల్ టారిఫ్‌లు చెల్లవని, అవి చట్టవిరుద్ధమైనవని న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు జడ్జీల బెంచ్ 2-1 తేడాతో తీర్పు చెప్పింది. కాంగ్రెస్ తనకిచ్చిన అధికారాన్ని అధ్యక్షుడు పరిమితికి మించి వాడుకున్నారని తెలిపింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంపై ట్రంప్ విధించిన డబుల్ డిజిట్ టారిఫ్‌లను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు చెప్పింది. తర్వాత ట్రంప్ మళ్లీ 10% తాత్కాలికంగా గ్లోబల్ టారిఫ్‌లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రేడ్ యాక్ట్ 1974లో సెక్షన్ 122ను ప్రయోగిస్తూ ట్రంప్ కొత్త టారిఫ్ లను అమల్లోకి తెచ్చారు. ఈ ఏడాది జులై 24న ఆ టారిఫ్‌ల కాలపరిమితి ముగియనున్నది. ఈ టారిఫ్‌లను కొన్ని చిన్న కంపెనీలు న్యూయార్క్‌లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టులో సవాలు చేశాయి. కేసు వేసిన కంపెనీల్లో 24 రాష్ట్రాలతో పాటు స్పైస్ కంపెనీ బుర్లాప్ అండ్ బారెల్, టాయ్ కంపెనీ బేసిక్ ఫన్ ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాత లిబర్టీ జస్టిస్ సెంటర్ లిటిగేషన్ డైరెక్టర్ జెఫ్రీ ష్వాబ్ మీడియాతో మాట్లాడుతూ ''గ్లోబల్ టారిఫ్ లపై మేము పోరాడాం. ఈరోజు తీర్పు మాకు అనుకూలంగా రావడంతో మేము గెలిచాం. తీర్పుపై చాలా ఎగ్జైటింగ్ గా ఉంది' అని పేర్కొన్నారు.
0 Comments