తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణను పురస్కరించుకుని గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై కొందరు సాగించిన అనుచిత ప్రచారం తీవ్ర కలకలం రేపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను, విశ్వసనీయతను దిగజార్చేలా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు, దీని వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, ఇప్పటికే ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దానికి ప్రతిఫలంగా సదరు హైకోర్టు జడ్జి భర్తకు కీలకమైన చైర్మన్ పదవి ఇస్తారంటూ కొన్ని ఐటీ సెల్స్, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనుచిత ఆరోపణలతో కూడిన కథనాలను సర్క్యులేట్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్ తీవ్రంగా పరిగణించి చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా, దీనిని తదుపరి విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ విభాగానికి , కొత్తగా ఏర్పడిన సిట్ కు బదిలీ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవి ఈ సోషల్ మీడియా స్మియర్ క్యాంపెయిన్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం మెరిట్స్ ఆధారంగానే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయవర్గాలు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీనికి తోడు, బాధితురాలి గోప్యతకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ చేసిన మరికొందరిపై కూడా బాలల సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితురాలి హక్కులను కాపాడటంలో భాగంగా.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, వీడియోలు లేదా ఫొటోలను సోషల్ మీడియా,మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణమే తొలగించాలని న్యాయస్థానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి ప్రైవసీని దెబ్బతీసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేయరాదని చట్టం స్పష్టం చేస్తోంది.
0 Comments