తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో మంగళవారం ఒక సైకో వీరంగం సృష్టించాడు. మండల కేంద్రంలోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేశాడు. అటుగా వెళ్తున్న ఎయిమ్స్‌కు చెందిన నర్సింగ్ అధికారి పై అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడటంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికుల కథనం మేరకు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి ఒక్కసారిగా చేతిలో ఉన్న కత్తితో నర్సింగ్ అధికారి పై దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై దుండగుడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన నర్సింగ్ అధికారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments