పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్‌గ్రామ్‌లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చని అన్నారు. హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై నాలుగు బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం ప్రకారం చేశారని చెప్పారు. ఇది చంద్రనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. "ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు" అని అన్నారు. చంద‍్రనాథ్‌కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార‍్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య" అని అన్నారు. రాథ్‌ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. "ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమేనని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారని సువేందు చెప్పారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్‌గ్రామ్‌లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్ కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్‌గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
0 Comments