తెలంగాణలోని సూర్యాపేట రూరల్ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యాదగిరిని, ఆయన కూతురు యామినిని ఎస్పీ నరసింహ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో భాగంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ పోలీస్ సిబ్బంది కుటుంబాలకు సమయం కేటాయించి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ఎస్పీ ప్రశంసించారు. ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన యామిని పరీక్షలకు సిద్ధమైన విధానం, శిక్షణ గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మరిన్ని అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మిఠాయిలు పంచి అందరికీ తీపి పంచారు. కూతురు సమక్షంలోనే యాదగిరిని సన్మానించిన ఎస్పీ, యామిని మంచి లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పోలీస్ సిబ్బంది కూడా తమ పిల్లల చదువులు, లక్ష్యాలపై దృష్టి పెట్టి వారికి దిశానిర్దేశం చేయాలని సూచించారు.
0 Comments