ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత పుచ్చకాయ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతదేహాల పోస్టుమార్టం అనంతరం ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక వెల్లడైంది. గత ఏప్రిల్ 25న ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా (40), ఆయన భార్య నస్రీన్ (35), వారి కూతుళ్లు అయేషా (16), జైనెబ్ (13) బిర్యానీ తిని, అనంతరం వాటర్ మిలన్ తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ, వారు చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఇలా బిర్యానీ తిని, ఆ తర్వాత పుచ్చకాయ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక విడుదలైంది. పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను చూసి విస్తుపోయారు. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు అవయవాలు రంగు మారవు. కానీ, మరణించిన నలుగురి మెదడు, గుండె, జీర్ణావయవాలు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇది ఏదైనా శక్తివంతమైన విష ప్రయోగం వల్లనే జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అబ్దుల్లా శరీరంలో ‘మార్ఫైన్’ అనే ప్రమాదకర రసాయనాన్ని గుర్తించారు. శరీరమంతా విషం వేగంగా వ్యాపించడం వల్లే అవయవాల రంగు మారిందని నిపుణులు భావిస్తున్నారు. బాధితులు తిన్న పుచ్చకాయ ఎక్కడి నుండి వచ్చింది, దానికి ఏమైనా విషపూరిత రసాయనాలు కలిపారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
0 Comments