Ad Code

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో సమావేశమైన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి


బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో బుధవారం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి సమావేశమయ్యారు. వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అరాగ్చి వాంగ్‌యితో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ సమావేశంలో చైనా తమకు సన్నిహిత మిత్రదేశమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలపడుతుందని అరాగ్చి అన్నట్లు ఇరాన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. అలాగే చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము మా వంతు కృషి చేస్తాము. మేము కేవలం న్యాయమైన, సమగ్రమైన ఒప్పందాన్ని మాత్రమే అంగీకరిస్తాము అని అరాగ్చి అన్నారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం వల్ల ప్రాంతీయ ఇంధనం, మౌలికసదుపాయాలతోపాటు, ప్రపంచ చమురు, గ్యాస్‌ సరఫరాలకు అంతరాయం కలుగుతోంది. దీనివల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో జరుగుతున్న చర్చల గురించి కూడా వాంగ్‌యితో అరాగ్చి చర్చించారు. ఈ సందర్భంగా ఇరాన్‌- అమెరికా వీలైనంత త్వరగా జలసంధిని తెరవాలని వాంగ్‌యి పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ఘర్షణలను ప్రారంభించడం మరింత ఆమోదయోగ్యం కాదని, చర్చలు కొనసాగించడం అత్యవసరం అని చైనా భావిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్‌పై చేసిన దాడుల తర్వాత అరాగ్చి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu