Ad Code

లద్దాఖ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ : మేజర్ జనరల్, ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు


భారత సైన్యానికి చెందిన ఒక హెలికాప్టర్ లద్దాఖ్ సెక్టార్‌లో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. మే 20న జరిగిన ఈ ప్రమాద ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో నిఘా లేదా సాధారణ పర్యటనలో భాగంగా వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ రంగంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ‘చీతా’ రకానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైంది. లద్దాఖ్ వంటి అత్యంత ఎత్తైన, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలడం రక్షణ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు రక్షణ శాఖ అధికారులు గాయపడ్డారు. వారిలో మేజర్ జనరల్ సచిన్ మెహతా (డివిజన్ కమాండర్) ఇద్దరు ఆర్మీ పైలట్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రక్షణ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్కీగా వారి ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అత్యంత సురక్షితంగా భావించే ఆర్మీ హెలికాప్టర్ లద్దాఖ్ సెక్టార్‌లో ఎందుకు కుప్పకూలిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా అనే విషయాలను నిర్ధారించేందుకు సైనిక అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu