Ad Code

కేపీఐటీ టెక్నాలజీస్‌ చైర్మన్‌ రవి పండిట్‌ కన్నుమూత


కేపీఐటీ టెక్నాలజీస్‌ ఫౌండర్‌, చైర్మన్‌ ఎస్‌బీ రవి పండిట్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌ పరిష్కారాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేపీఐటీ టెక్నాలజీస్‌ను స్థాపించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రవి పండిట్ కీలక పాత్ర పోషించారు. మూడు దశాబ్దాలకుపైగా వ్యాపార, సాంకేతిక రంగాల్లో సేవలందించిన రవి పండిట్‌ పుణె కేంద్రంగా కేపీఐటీ టెక్నాలజీస్‌ను ప్రారంభించి, సంస్థ కార్యకలాపాలను 15 దేశాలకు విస్తరించారు. అలాగే 1,200 మందికిపైగా నిపుణులతో పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ కీర్తానే అండ్ పండిట్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు కూడా ఆయన నాయకత్వం వహించారు. సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికీ ఆయన విశేషంగా కృషి చేశారు. పుణె ఇంటర్నేషనల్ సెంటర్‌, జన్వానీ సంస్థలకు సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన, గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌ లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు మార్గనిర్దేశం చేశారు. జ్ఞాన ప్రబోధిని సంస్థ అధ్యక్షుడిగా యువ నాయకత్వ వికాసానికి తోడ్పడ్డారు. రవి పండిట్‌ అమెరికాలోని ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ పూర్వ విద్యార్థి. బంగారు పతక విజేత చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా కూడా సేవలందించారు. అంతేకాదు.. రచయితగానూ రవి పండిట్‌ గుర్తింపు పొందారు. పురస్కారం పొందిన 'లీప్‌ఫ్రాగింగ్‌ టు పోల్‌-వాల్టింగ్‌' అనే గ్రంథానికి ఆయన సహ రచయితగా వ్యవహరించారు.

Post a Comment

0 Comments

Close Menu