Ad Code

ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసైన కానిస్టేబుల్ భార్యభర్తలు : అప్పులు తీర్చడం కోసం హత్య, చోరీలు !


తెలంగాణలోని సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసై భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్లైన్ ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. ప్రవీణ్ కుమార్ తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించి  గత శనివారం పథకం ప్రకారం, భార్యభర్తలిద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు. ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్ కు తరలించారు. విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకుని, మార్గ మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్ లో  విక్రయించాడు. 

Post a Comment

0 Comments

Close Menu