Ad Code

అమెరికాలో చేదు అనుభవం ఎదుర్కొన్న యూట్యూబర్ అరుణ్ రూపేష్ మైని : జాత్యహంకారానికి పరాకాష్ట అని సోషల్ మీడియాలో పోస్టులు


ప్రముఖ బ్రిటీష్-ఇండియన్ టెక్ యూట్యూబర్ అరుణ్ రూపేష్ మైని, అందరికీ 'MrWhoseTheBoss' గా సుపరిచితుడు. కోట్లాది మంది సబ్‌స్క్రైబర్‌లతో టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈయనకు, అమెరికాలో ఎదురైన ఒక అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకప్పుడు లక్షల డాలర్ల డీల్ కోసం వెళ్తే, అక్కడ అతనికి ఎదురైన అవమానం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొన్ని ఏళ్ల క్రితం అరుణ్ మైనికి అమెరికాలోని ఒక హై-టెక్ స్టేడియం గురించి కవర్ చేయమని ఏకంగా $300,000 (సుమారు 2.5 కోట్ల రూపాయలు) భారీ ఆఫర్ వచ్చింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడంతో చాలా ఎగ్జైట్ అయిన అరుణ్, వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. కానీ, అక్కడి ఎయిర్‌పోర్ట్ బోర్డర్ కంట్రోల్ అధికారుల రూపంలో అతనికి మృత్యువు లాంటి పీడకల ఎదురవుతుందని అతను ఊహించలేదు. ఎయిర్‌పోర్ట్ లో దిగగానే అధికారులు అతన్ని ఆపి, "ఎందుకు వచ్చావు?" అని ప్రశ్నిస్తూ పక్కనే ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతని ఫోన్ లాక్కుని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బంధించారు. బయట అతన్ని పికప్ చేసుకోవడానికి స్పాన్సర్లు వేచి చూస్తున్నా, కనీసం వారికి ఒక్క మెసేజ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. గంటలు గడుస్తున్న కొద్దీ ఆ విచారణ కాస్తా భయంకరంగా మారింది. అధికారులు అతన్ని మరో చీకటి గదిలోకి తీసుకెళ్లి, అక్కడ తుపాకులు పట్టుకున్న గార్డుల మధ్య ఉంచారు. "అక్కడ నన్ను ఒక ఖైదీలా చూశారు, నా బట్టలు విప్పదీసి ఒళ్లంతా తనిఖీ చేశారు. అది అత్యంత అవమానకరమైన అనుభవం" అని అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి తాను ఎక్కడ ఉన్నానో చెప్పలేక, ఏ నేరం చేయకుండానే 26 గంటల పాటు ఆ సెల్‌లో గడపడం తనను మానసికంగా కృంగదీసిందని అతను తెలిపాడు. 26 గంటల నిర్బంధం తర్వాత, అతన్ని విడిచిపెట్టారు కానీ అమెరికాలోకి రానివ్వలేదు. తిరిగి తన దేశానికి పంపే ఫ్లైట్ ఎక్కే వరకు అతని ఫోన్ కూడా ఇవ్వలేదు. గాల్లోకి విమానం ఎగిరిన తర్వాతే అతను తన కుటుంబానికి అసలు విషయం చెప్పగలిగాడు. ఆ ఒక్క ఘటనతో అతని రికార్డులో 'బ్లాక్ మార్క్' పడిపోయింది. ఇప్పుడు అతను ఎప్పుడు అమెరికా వెళ్లినా, గంటల తరబడి సెకండ్ రూమ్‌లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయం బయటకు రాగానే నెటిజన్లు అమెరికా బోర్డర్ కంట్రోల్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. "ఒక ప్రముఖ యూట్యూబర్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం భద్రతా తనిఖీ కాదని, జాత్యహంకారానికి పరాకాష్ట అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అరుణ్ మైని వెల్లడించిన ఈ షాకింగ్ విషయాలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. 

Post a Comment

0 Comments

Close Menu