సాధారణంగా విదేశాలకు వెళ్లేవారు అంతర్జాతీయ రోమింగ్ కోసం ప్రత్యేక ప్యాక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. వారి కోసం వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్ రూ. 4,997తో ముందుకొచ్చింది. దీని ద్వారా ఏడాది పొడవునా భారత్‌లో డేటా, కాలింగ్ ప్రయోజనాలు పొందడమే కాకుండా, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా అదనపు ఖర్చు లేకుండా కనెక్టివిటీని పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన 'గ్లోబల్ ఐఆర్' ప్యాక్‌లకు పోటీగా వొడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా అందింస్తుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 సందేశాలు ఉచితం. ఈ ప్లాన్ అసలు ప్రత్యేకత అంతర్జాతీయ ప్రయోజనాల్లోనే ఉంది. దీనిని సెట్ 1, సెట్ 2గా విభజించారు: సెట్ 1లో 59 దేశాలున్నాయి. ఈ దేశాల్లో ఉన్నప్పుడు వినియోగదారులకు 100 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. అలాగే 5జీబీ అంతర్జాతీయ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. సెట్ 2లో 65 దేశాలున్నాయి. ఇక్కడ 50 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్, 1జీబీ ఇంటర్నేషనల్ డేటా లభిస్తుంది. దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి 25 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ లభిస్తాయి (ఇక్కడ డేటా సదుపాయం లేదు). ఒకవేళ కేటాయించిన ఉచిత నిమిషాలు పూర్తయితే, నిమిషానికి కేవలం రూ. 10 చొప్పున ఛార్జ్ చేస్తారు. అలాగే రోమింగ్‌లో ఉన్నప్పుడు SMS పంపితే ఒక్కో మెసేజ్‌కు రూ. 15 వసూలు చేస్తారు. ఈ హైబ్రిడ్ ప్లాన్ ముఖ్యంగా వ్యాపారవేత్తలు, తరచుగా విదేశీ పర్యటనలు చేసే పర్యాటకులు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎంతో లాభదాయకం. ప్రతిసారి కొత్త సిమ్ తీసుకోవడం లేదా విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారీ రోమింగ్ ప్యాక్‌లు వేయించుకునే అవసరం లేకుండా, ఒకే రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రశాంతంగా ఉండవచ్చు. టెలికాం రంగంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే ఇలాంటి ప్లాన్లను తీసుకురాగా, ఇప్పుడు వీఐ కూడా అదే బాటలో పయనిస్తూ ప్రీమియం వినియోగదారులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఒకే ప్లాన్ - రెండు ప్రయోజనాలు అన్నట్లుగా ఉన్న ఈ హైబ్రిడ్ రీఛార్జ్ విదేశీ ప్రయాణాలను మరింత సులభతరం చేయనుంది.
0 Comments